: తొలి మీడియా సమావేశంతోనే రవిశాస్త్రికి, తనకి మధ్య తేడా చూపిన జంబో!


టీమిండియా ప్రధాన కోచ్ గా ఎంపికైన జంబో (అనిల్ కుంబ్లే) తొలి మీడియా సమావేశంతోనే రవిశాస్త్రికి, తనకు మధ్య తేడాను స్పష్టంగా చూపించాడు. కోహ్లీ మద్దతు, వెటరన్ల అండ ఉన్నప్పటికీ ప్రధాన కోచ్ కాలేకపోవడంతో గత వారం రోజులుగా రవిశాస్త్రి అక్కసు వెళ్లగక్కుతుండగా... కోచ్ ఎంపిక గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని కుంబ్లే తేల్చిచెప్పాడు. కోచ్ తానా? రవిశాస్త్రా? అన్నది పక్కనపెట్టాలని, జట్టు బాగా ఆడడం అన్నది అందరికీ కావాలని తెలిపాడు. ప్రస్తుతం టీమిండియా అనుభవం, యువ ఆటగాళ్ల మేలికలయికతో సమతూకంగా ఉందని చెప్పాడు. ఇలాంటి జట్టుకు శిక్షకుడుగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపాడు. సొంత జట్టుకు ప్రధాన కోచ్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. ఏడాది వ్యవధికి తనను కోచ్ గా ఎంపిక చేసినందుకు బాధలేదని తెలిపాడు. కాగా, రవిశాస్త్రి గగ్గోలు పెట్టినా ఇప్పుడు టీమిండియా కోచ్ కాలేడన్నది వాస్తవం. ఇలాంటి సమయంలో అనుభవజ్ఞుడైన రవిశాస్త్రి, ఇకపై కుంబ్లే అడిగితే సహకరిస్తానని, జట్టుకు సంబంధించిన సలహాలు ఇస్తానని పెద్దరికం నిలుపుకుంటే బాగుండేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రీడా స్పూర్తికి విరుద్ధంగా శాస్త్రి తాను ఎంపిక కాకపోవడంపై నిరంతరం అక్కసు వెళ్లగక్కడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వారు చెబుతున్నారు. కుంబ్లే జట్టులో రాజకీయాలు ప్రోత్సహించే రకం కాదని, శాస్త్రి ఎలాంటి ఎత్తుగడలు వేసినా ఉపయోగం ఉండకపోగా, బెడిసికొట్టే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News