: పాపం పసివాడు... ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, ఊపిరాడక మృతి!
హైదరాబాదులోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ లో దారుణం చోటుచేసుకుంది. శ్రీయాన్ అనే బాలుడు ఇంట్లో ఆడుకుంటూ ప్లాస్టిక్ కవర్ ముఖానికి తగిలించుకున్నాడు. తరువాత కాసేపటికే బెడ్ రూమ్ లోకి వెళ్లి మంచంపై పడిపోయాడు. అంతసేపు అల్లరి చేసిన పిల్లాడు నిద్రవచ్చి బెడ్రూంలో నిద్రపోతున్నాడని కుటుంబ సభ్యులు భావించారు. దీంతో శ్రీయాన్ ను పట్టించుకోలేదు. కొద్ది సేపటికి బెడ్ రూమ్ లోకి వెళ్లిన తల్లి చూడగా, బాలుడి ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఉంది. దీంతో ఆందోళన చెందిన ఆమె దానిని తొలగించి చూడగా, బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే హుటాహుటీన దగ్గర్లోని హాలిస్టిక్ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా, బాలుడు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.