: తేరుకున్న మార్కెట్... 'బ్రెగ్జిట్' పూర్వపు స్థాయికి!
ఐరోపా యూనియన్ నుంచి యూకే విడిపోవాలని తీర్పిచ్చిన రోజున, మిగతా దేశాల దారిలోనే నడిచి భారీగా నష్టపోయిన భారత మార్కెట్ తిరిగి పూర్వపు స్థాయికి చేరుకుంది. నూతన కొనుగోళ్లు వెల్లువెత్తిన వేళ, సెషన్ ఆరంభం నుంచే భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన సూచికలు, ఆపై మరే దశలోనూ వెనుదిరిగి చూడలేదు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ లక్ష కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 215.84 పాయింట్లు పెరిగి 0.81 శాతం లాభంతో 26,740.39 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 76.15 పాయింట్లు పెరిగి 0.94 శాతం లాభంతో 8,204.00 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.98 శాతం, స్మాల్ కాప్ 1.31 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 41 కంపెనీలు లాభపడ్డాయి. బోష్ లిమిటెడ్, హీరో మోటోకార్ప్, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, విప్రో తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, లూపిన్, కోల్ ఇండియా, ఐటీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,786 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,848 కంపెనీలు లాభాలను, 752 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం నాడు రూ. 1,00,70,495 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,01,76,749 కోట్లకు పెరిగింది.