: సెలబ్రెటీలకు బంధువులా కాకుండా స్వయంగా అవకాశాల కోసం ప్రయత్నిస్తా: హీరోయిన్ నజియా హుస్సేన్
సినీ పరిశ్రమలో సీనియర్ నటుల వారసుల సినీరంగ ప్రవేశం ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. ఆల్ రెడీ సెటిల్ అయిపోయిన నటుల పేరు చెప్పుకొని వారి కుమారులు, కూతుళ్లు, బంధువులు సినీ రంగ ప్రవేశం చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. కొందరు అగ్ర తారలు తమ వారసులుగా తమ కుటుంబంలోని వ్యక్తులు, బంధువుల పేర్లను ప్రకటిస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఆల్ రెడీ సినీ రంగంలో ఉన్న వారి పేర్లను చెప్పుకొని ఎటువంటి కష్టం లేకుండా నటులుగా స్థిరపడిపోతుంటారు. అయితే, తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ సినిమాలో హీరోయిన్గా నటించిన నజియా హుస్సేన్ సినిమా అవకాశాల కోసం చేస్తోన్న ప్రయత్నాలు మాత్రం ఈ ఆనవాయితీకి భిన్నంగా ఉన్నాయి. ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు దగ్గరి బంధువు. అయినా సంజయ్‌దత్ పేరును ఏ మాత్రం ఉపయోగించుకోకుండా స్వయంగా ప్రయత్నిస్తూ అవకాశాలను వెతుక్కుంటోంది. హీరోయిన్గా అవకాశం కోసం ఆడిషన్లకు వెళ్లి క్యూలో నించొని మరీ ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె మీడియాతో చెప్పింది. ప్రస్తుతం 2006లో విడుదలైన ‘టామ్.. డిక్.. హ్యారీ’ సినిమాకి సీక్వెల్లో నటిస్తోన్న ఈ భామ.. తాను సాధారణమైన వ్యక్తినేనని వ్యాఖ్యానించింది. అయితే తనకు సెలబ్రిటీలైన బంధువులున్నారని తెలిపింది. అయినప్పటికీ తాను సినీరంగంలో అవకాశాలను వెతుక్కుంటూ ఆడిషన్లకు వెళతానని చెప్పింది. అంతేకాదు లోకల్ ట్రయిన్లలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కొత్తగా సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి యువత ఎలా ప్రయత్నాలు చేస్తుందో అదే రీతిలో తాను ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ఆమె పేర్కొంది. ఇలా చేయడం తనకు గర్వంగా ఉందని తెలిపింది.