: పదేపదే హారన్ కొడితే రూ. 5 వేల వరకూ చెల్లించుకోవాల్సిందే!... చట్టం తేవడానికి కేంద్రం కసరత్తు
రోడ్డు మీద పోతున్న వేళ, ట్రాఫిక్ జాంలోనో లేదా సిగ్నల్స్ పడ్డ సమయంలోనో వాహనాలు ఆగినప్పుడు, అనవసరంగా హారన్ మోత మోగించేవారి జేబుకిక చిల్లు పడనుంది. అనవసరంగా హారన్ కొట్టే వారిపై రూ. 500 నుంచి రూ. 5 వేల వరకూ జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు మోటారు వాహన చట్టానికి వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలు చేయాలని మోదీ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు పలు రాష్ట్రాల రవాణా మంత్రుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. తొలిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే, రూ. 500, రెండోసారి రూ. 1000 ఆపై మరింత భారీగా ఈ జరిమానా ఉంటుంది. ఇక సైలెంట్ జోన్లు... అంటే ఆసుపత్రులు, స్కూళ్లు తదితర హారన్ కొట్టరాదన్న బోర్డులు ఉండే ప్రాంతాల్లో తొలుత ఈ నిర్ణయం గట్టిగా అమలు చేయాలన్నది కేంద్రం ప్రయత్నం. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే అవకాశాలున్నాయి.