: తెలంగాణలో కొనసాగుతోన్న న్యాయవాదుల ఆందోళన.. పలు చోట్ల ఉద్రిక్తత
తెలంగాణలో న్యాయవాదులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. హైకోర్టుకు భారీ సంఖ్యలో న్యాయవాదులు బయలుదేరారు. అయితే, వారిని మదీనా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదుల ఆందోళన దృష్ట్యా హైకోర్టు వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అక్కడి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇప్పటికే హైకోర్టు వద్దకు చేరుకున్న నలుగురు న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు వరంగల్ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. కోర్టు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయవాదులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, హైకోర్టు విభజన, ఐచ్ఛికాలు రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో న్యాయస్థానాల సముదాయం గేటుకు న్యాయవాదులు తాళం వేశారు. అయితే, ఆ తాళాన్ని పోలీసులు పగులగొట్టారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.