: ఫైవ్ స్టార్ హోటల్ ఉద్యోగి చేతివాటం.. ఆలయంలో అమ్మవారి ఆభరణాలు మాయం చేసిన ఘనుడు!


ఢిల్లీలోని ప్రముఖ ఐదు నక్షత్రాల హోటల్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దొంగగా మారాడు. ఆలయంలోకి వెళ్లి అమ్మవారి కిరీటం, నగలు కాజేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈనెల 23న ఢిల్లీలోని షెరావలి ఆలయంలోని అమ్మవారి కిరీటం, నెక్లెస్ చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజిని పోలీసులు పరిశీలించారు. దాని ప్రకారం.. 52, జీఏఐఎన్ఐ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించిన వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడు. కాసేపు అక్కడే తచ్చాడాడు. తనను ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత మెల్లగా గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి కిరీటం, నెక్లెస్ తీసుకుని పరారయ్యాడు. ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఓ గురుద్వారా వద్ద నిందితుడు ధరించిన టీ షర్ట్ లాంటిదే వేసుకున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా అతడే దొంగ అని తేలింది. తనపేరు డేవిడ్ ప్రధాన్ అని, ఫైవ్‌స్టార్ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నానని పేర్కొన్నాడు. తనది డార్జిలింగ్ అని చెప్పుకొచ్చాడు. ఆలయంలో ఆభరణాలు దొంగిలించింది తానేనని అంగీకరించాడు. తైమూర్ నగర్‌లోని అతడి ఇంటి నుంచి పోలీసులు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News