: కాల్పుల విరమణను పాక్ 11,270 సార్లు ఉల్లంఘించింది: మెహబూబా ముఫ్తీ
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ 11,270 సార్లు ఉల్లంఘించిందని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఈ కారణంగా 144 మంది భద్రాతా సిబ్బంది సహా 313 మంది పౌరులు మరణించారని ఆమె పేర్కొన్నారు. జనవరి 1, 2002 నుంచి డిసెంబరు 31, 2015 మధ్య పాక్ ఈ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. 2002లో అత్యధికంగా 8376 సార్లు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించగా 2003లో 2045 సార్లు ఉల్లంఘించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె పేర్కొన్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం నవంబరు 2003లో కుదిరింది. ఆ తర్వాత 2004, 2005, 2007లో ఒక్కటంటే ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదని ముఫ్తీ వివరించారు. 2002లో జమ్ముకశ్మీర్ సరిహద్దు వెంబడి జరిగిన షెల్ దాడులలో 169 మంది పౌరులు, 144 మంది భద్రతా సిబ్బంది మరణించారు. 2002లో అత్యధికంగా 76 మంది, 2003లో 59 మంది పౌరులు మరణించారు. ఆ తర్వాత పదేళ్లలో నలుగురు మరణించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2014, 15లో వరుసగా 14, 16 మంది కాల్పుల విరమణ ఉల్లంఘనల కారణంగా మరణించినట్టు తెలిపారు. మొత్తం 735 మంది పౌరులు, 311 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారన్నారు. 2002లో 58 మంది సెక్యూరిటీ సిబ్బంది మరణించగా 157 మంది గాయపడినట్టు ముఫ్తీ వివరించారు.