: సచివాలయం ప్రారంభం ఏపీలో అత్యంత కీలక ఘట్టమే!... చంద్రబాబు గైర్హాజరీలో కార్యక్రమం!
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నేడు ఏపీలో కీలక ఘట్టం చోటుచేసుకుంటోంది. రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఏర్పడ్డ ఏపీకి కేపిటల్ గా గుంటూరు జిల్లా పరిధిలోని తుళ్లూరు పరిసరాల్లో అమరావతి పేరిట నూతన రాజధానిని ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే భూసేకరణ పూర్తి కాగా రాజధాని నిర్మాణ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ నెల 27 లోగా సచివాలయ ఉద్యోగులు తాత్కాలిక సచివాలయానికి తరలిరావాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ క్రమంలో పలు శాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్లు విజయవాడ, గుంటూరులకు తరలివెళ్లగా... నేడు తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు తాత్కాలిక సచివాలయంలోని ఐదో బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ ను అధికారులు సిద్ధం చేశారు. దీనిలోనే నూతన రాజధానిలో ఏపీ సచివాలయానికి అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో నవ్యాంధ్రలో కీలక ఘట్టంగా పరిగణిస్తున్నారు. ఏపీ పాలన ఏపీ భూభాగానికి మారుతున్న ఈ కీలక ఘట్టం ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబునాయుడు లేకుండా జరుగుతుండటం విశేషం. నాలుగు రోజుల క్రితం చైనా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు... రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడ వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు గైర్హాజరీలో జరుగుతున్న ఈ కార్యక్రమం నలుగురు మంత్రులు, హైదరాబాదు నుంచి తరలివస్తున్న 200 మంది సెక్రటేరియట్ ఉద్యోగులు, ఇప్పటికే విజయవాడ, గుంటూరుల్లో ఏర్పాటైన కార్యాలయాల సిబ్బంది సమక్షంలో జరగనుంది.