: ఈ నెలాఖరు నుంచి ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ల డెలివరీ
ఈ నెల 28 నుంచి ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేస్తానని చెప్పిన రింగింగ్ బెల్స్ సంస్థ మళ్లీ మాట మార్చింది. ఈ నెల 30 వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా రింగింగ్ బెల్స్ సీఈఓ మోహిత గోయల్ మాట్లాడుతూ, ఈ నెల 30 నుంచి జులై 5వ తేదీ వరకు ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ల డెలివరీ జరుగుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధిక వినియోగదారులు ఈ ఫోన్ల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. లక్కీ డ్రా ద్వారా ఈ రాష్ట్రంలోని సుమారు పదివేల మందికి ఫోన్లను అందజేయనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, జూన్ 30 నుంచి జులై 5వ తేదీలోగా రెండు లక్షల ఫోన్లను సదరు సంస్థ వినియోగదారులకు పంపాల్సి ఉంది. ఇదంతా సాధ్యమయ్యే పనేనా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకె అంటే రూ.251కే స్మార్ట్ ఫోన్లను అందిస్తానని చెప్పిన రింగింగ్ బెల్స్ సంస్థ వాటి డెలివరీ తేదీని వాయిదా వేస్తూ వస్తోంది. ఈసారైనా చెప్పిన సమయానికి ఫోన్లను పంపుతుందా? అనే అనుమానాలు వినియోగదారుల్లో తలెత్తుతున్నాయి.