: వెంకయ్యనాయుడి సహనాన్ని పరీక్షించిన ఎయిరిండియా!


ఎలాంటి సందర్భాన్నయినా అద్భుతమైన వాక్ చాతుర్యంతో ఆకట్టుకోగల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి ఎయిరిండియాపై ఆగ్రహం కలిగింది. దీంతో సదరు సంస్థపై ట్వీట్ల వర్షం కురిపించారు. నేటి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెంకయ్యనాయుడు బయలుదేరారు. ఎయిర్ ఇండియా 544 విమానంలో సీటు ఖరారు కావడంతో ఆయన 12:20 నిమిషాలకు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే, ఆ సమయానికి విమానం టేకాఫ్ కాలేదు. ఇంతలో 'పైలట్ ఇంకా రాలేదని, మరి కొద్దిసేపు వేచిచూడాలని' అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన 1:45 వరకు ఎదురుచూశారు. తొలుత సమాచారం అందించిన అధికారులు ఆ తరువాత మళ్లీ కనపడలేదు. దీంతో ఆయన ఎదురు చూసి విసిగిపోయి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. తరువాత ఎయిర్ ఇండియా నిర్వాకంపై మండిపడుతూ ట్వీట్లు సంధించారు. సర్వీసు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని ఎయిర్ ఇండియాను నిలదీశారు. విమానయాన రంగంలో పోటీకి అనుగుణంగా మారడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించుకోవాలని ఆయన ఎయిరిండియాకు హితవు పలికారు. ఎయిరిండియా నిర్వాకం వల్ల తన ముఖ్యమైన కార్యక్రమాలు రద్దయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News