: జడ్జీలను సస్పెండ్ చేయడం దేశంలో ఇదే తొలిసారి!: కేకే
తెలంగాణలో జడ్జీలను సస్పెండ్ చేయడం దేశంలో ఇదే తొలిసారని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు (కేకే) అన్నారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి టీఆర్ఎస్ ఎంపీలు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేకే మాట్లాడుతూ, జడ్జీల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ మిగతావారు కూడా సామూహిక రాజీనామా చేస్తామంటున్నారని అన్నారు. ఆప్షన్ ఇచ్చిన ఆంధ్రా న్యాయమూర్తులను తెలంగాణ పోస్టుల్లో నియమించారని, దీంతో, తెలంగాణ హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులు లేని పరిస్థితి వస్తుందని అన్నారు. జడ్జీల సస్పెన్షన్ విషయమై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో పాటు డీవోపీటీ మంత్రిని కూడా కలిశామని చెప్పారు. ఈ విషయాన్ని న్యాయశాఖా మంత్రి వద్ద ప్రస్తావించగా తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన తమతో అన్నారని చెప్పారు. ఇది న్యాయవ్యవస్థకు చెందిన అంశమని, చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరామని, మరో రెండు, మూడు రోజుల్లో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని కేకే పేర్కొన్నారు.