: రెడ్ క్రాస్ జాతి వివక్ష... ఆపై 'సారీ'!
స్విమ్మింగ్ పూల్ లో చిన్నారులు చేయదగిన, చేయకూడని పనులంటూ రెడ్ క్రాస్ సొసైటీ విడుదల చేసిన ఓ పోస్టర్ జాతి వివక్ష చూపుతున్నట్టుగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆపై క్షమాపణలు కోరిన రెడ్ క్రాస్ ప్రతినిధులు, తమ ప్రమేయం లేకుండానే తప్పు జరిగిపోయిందని వెల్లడించారు. ఇంతకీ ఈ పోస్టరులో ఏముందో తెలుసా? ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద కొందరు చిన్నారులు ఈతలు కొడుతూ, మరికొందరు ఈతకు సిద్ధమవుతూ ఉండగా, 'బీ కూల్, ఫాలో దీ రూల్స్' అంటూ ఓ డాల్ఫిన్ చెబుతున్నట్టు ఉంది. ఆపై కొందరు 'నాట్ కూల్' అని, కొందరు 'కూల్' అని అంటున్నట్టు ఉంది. ఇక నాట్ కూల్ అంటున్న వారంతా నల్లజాతి చిన్నారులుగా చూపిన రెడ్ క్రాస్, కూల్ అని అంటున్నవారు తెల్లజాతి వారని, నిబంధనలు పాటించేవారని చూపుతున్నట్టు ఉంది. బాలికలు, బాలలకు విడివిడిగా స్విమ్మింగ్ ఏరియాను చూపుతూ మధ్యలో ఓ గీత ఉండగా, బాలికల ప్రాంతంలోకి డైవ్ కొడుతున్న ఓ నల్లజాతి బాలుడు, ఆపై ఓ తెల్లజాతి బాలికను బలవంతంగా పూల్ లోకి నెడుతున్న నల్లజాతి బాలుడి చిత్రాలను ఇందులో చూపారు. దీంతో ఈ పోస్టర్ నల్లజాతి పిల్లలకు వ్యతిరేకంగా ఉందని, జాతి వివక్ష చూపారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన రెడ్ క్రాస్ 'సారీ' చెప్పింది.