: కేసీఆర్ ప్రభుత్వం చొరవ తీసుకోలేదు.. అందుకే న్యాయవాదులు రోడ్డెక్కారు: పొన్నం ప్రభాకర్
కేసీఆర్ ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం వల్లే తెలంగాణలో న్యాయవాదులు రోడ్డెక్కారని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి హైకోర్టు విభజన జరిపించాల్సిన కేసీఆర్ ఆ విషయంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఢిల్లీలో దీక్ష చేస్తానని చెప్పుకుంటోన్న కేసీఆర్.. న్యాయవాదుల డిమాండ్‌ను సాధించిన తరువాతే తెలంగాణకి రావాలని ఆయన ఉద్ఘాటించారు. హైకోర్టు విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేసిన ప్రయత్నం ఏంటని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బార్ అసోసియేషన్ మారిందని ఆయన ఆరోపించారు. దమ్ముంటే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛలో సెక్రటేరియట్, ఛలో క్యాంప్ ఆఫీస్, ఛలో టీఆర్ఎస్ ఆఫీస్కు పిలుపునివ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనలో జాప్యం అంశాన్ని కేంద్రం, ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్, టీడీపీలపైకి నెట్టేస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్షాన్ని న్యూఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.