: 16 రోజుల నుంచి వాడిన నూనెనే వాడుతున్న మెక్ డొనాల్డ్... ప్రభుత్వం నోటీసులు!
దేశంలోని పలు నగరాల్లో వెస్ట్రన్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ ను నిర్వహిస్తున్న మెక్ డొనాల్డ్ లో 16 రోజుల నాటి వంట నూనెను వాడుతుండటంతో, సీరియస్ గా తీసుకున్న రాజస్థాన్ ఆరోగ్య విభాగం నోటీసులు పంపింది. రొటీన్ చెకింగ్స్ లో భాగంగా జైపూర్ లోని మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్లలో తనిఖీలు నిర్వహించగా, ఈ విషయం బహిర్గతమైందని అధికారులు తెలిపారు. జూన్ 17న తాము తనిఖీలు నిర్వహించామని, ఇందులో పాంచ్ బట్టి ప్రాంతంలోని మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీ కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న రెస్టారెంట్లో వాడేసిన నూనెనే వాడుతూ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని, నూనెలో ఎంతమాత్రమూ నాణ్యత లేదని జూన్ 1 నుంచి అదే ఆయిల్ వాడుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని వివరించారు. "డీప్ ఫ్రై చేస్తున్న వంట నూనెల్లో పోషకాలేవీ వుండవు. ఇక అదే ఆయిల్ ను నిత్యమూ వాడితే క్యాన్సర్ కారక పోలీసైకిల్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్లు పెద్దఎత్తున పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద టాక్సిస్ ఆల్డిహైడ్స్ పుట్టుకొస్తాయి. ఈ ఆయిల్ వాడితే, క్యాన్సర్ వచ్చే ప్రమాదంతో పాటు గుండెజబ్బులు రావచ్చు. అలాగే, గర్భవతులకు ప్రమాదం సంభవిస్తుంది" అని రాజస్థాన్ క్యాన్సర్ ఫౌండేషన్ చీఫ్ డాక్టర్ రాకేష్ గుప్తా తెలిపారు. ఈ విషయంలో మెక్ డొనాల్డ్స్ స్పందన కోరగా, "ఇండియాలో నూనెల వాడకంపై ఎలాంటి నిబంధనలూ లేవు. కానీ మేము అన్ని స్టాండర్డ్స్ తో, క్వాలిటీతో ఉన్న నూనెలనే వాడుతాము. గత 60 ఏళ్లుగా 130 దేశాల్లో సేవలందిస్తున్నాం" అని పేర్కొంది.