: ‘ఉగ్ర’ బుల్లెట్లకు ఎదురొడ్డి సహచరులను కాపాడుకున్న వీర జవాన్లు!


కశ్మీర్ లోని పాంపోర్ లో గత వారం సీఆర్పీఎస్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. వాహనం నిండా ఉన్న జవాన్లు అప్పటిదాకా సంతోషంగా మాటలు చెప్పుకుంటూ సాగుతున్నారు. ఈ లోగా అప్పటికే ఆ వాహనమే లక్ష్యంగా మాటు వేసిన నలుగురు ఉగ్రవాదులు ఒక్క ఉదుటున దానిపై దాడికి దిగారు. ఏం జరిగిందో తెలిసేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే కాస్తంత ఆలస్యంగా తేరుకున్న ముగ్గురు జవాన్లు... తమ సహచరులను కాపాడుకునేందుకు ఉగ్రవాదుల బుల్లెట్లకు ఎదురొడ్డారు. ఓ వైపు ఉగ్రవాదుల చేతుల్లోని అత్యాధునిక తుపాకుల నుంచి దూసుకువచ్చిన బుల్లెట్లు శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా, శరీరం నుంచి రక్తం ధారలుగా కారుతున్నా... వారు వెనకడుగు వేయలేదు. ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షానికి దీటుగా వారూ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోగా... బుల్లెట్ గాయాలను లెక్కచేయని వీర జవాన్ల ధైర్యానికి బిక్కచచ్చిన మరో ఇద్దరు ఉగ్రవాదులు పలాయనం చిత్తగించారు. మొన్నటి పఠాన్ కోట్ ఉగ్రవాద దాడిలో ఉగ్రవాదులు ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేసిన గరుడ కమెండోల తరహాలోనే పాంపోర్ దాడిలోనూ ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు తమ సహచరులను కాపాడుకున్నారు. ఈ ముగ్గురు జవాన్లలో 48 ఏళ్ల వీర్ సింగ్... వీరత్వానికే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచాడు. తన శరీరంలోకి 7 బుల్లెట్లు దిగినా... అతడు తన తుపాకీ నుంచి ఏకంగా 39 రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. ఇక 38 ఏళ్ల కైలాశ్ యాదవ్, 39 ఏళ్ల సతీశ్ చంద్ కూడా వీర్ సింగ్ తరహాలోనూ ఉగ్రవాదుల నుంచి దూసుకువస్తున్న బుల్లెట్లు తమ సహచరులకు తగలకుండా బస్సు అద్దాలకు అడ్డుగా నిలిచి పోరు సాగించారు. ఉగ్రవాదుల దాడిలో వీరు ముగ్గురితో పాటు మరో ఐదుగురు జవాన్లు చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ముగ్గురు అడ్డుగోడగా నిలబడి ఉండకపోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేదని సైనికాధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News