: ఎయిర్ హోస్టెస్‌తో సెల్ఫీ కోసం విమానంలో వెంపర్లాట.. ప్రయాణికుడి అరెస్ట్
పెరిగిపోతున్న సెల్ఫీ పిచ్చికి ఇదో ఉదాహరణ. విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో సెల్ఫీ దిగాలన్న పిచ్చి ఇప్పుడు అతడిని కటకటాల పాల్జేసింది. దమామ్ నుంచి ముంబై వెళ్తున్న జెట్ ఎయిర్ విమానంలో ముంబై వస్తున్న మొహమ్మద్ అబూబకర్(29) ఎయిర్ హోస్టెస్‌తో సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమె వెనకాలే వచ్చి వేధించసాగాడు. దీంతో నివ్వెరపోయిన ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో క్రూ సిబ్బంది రంగంలోకి దిగారు. వారిని చూసిన అబూబకర్ వెంటనే టాయిలెట్లోకి వెళ్లి సిగరెట్ కాల్చి బయటకు వచ్చాడు. ఈ ఘటనపై సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సెక్యూరిటీ చెక్‌ను తప్పించుకుని అబూబకర్ విమానంలోకి సిగరెట్, లైటర్ ఎలా తీసుకురాగలిగాడన్న విషయంపై దర్యాప్తు జరపనున్నట్టు పోలీసులు తెలిపారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరికీ పంపనున్నట్టు పేర్కొన్నారు. కాగా నిందితుడు అబూబకర్ గుజరాత్ వాసి అని సౌదీ అరేబియాలోని దమామ్‌లో ఓ హోటల్లో పనిచేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.