: పూర్తిగా కోలుకున్న ముద్రగడ!... గొంతు నొప్పితో బాధపడుతున్న కాపు నేత సతీమణి!
పది రోజులకు పైగా ఆమరణ దీక్ష చేసిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పూర్తిగా కోలుకున్నారు. తుని విధ్వంసకారుల పేరిట పోలీసులు అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయడంతో పాటు కాపులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలన్న డిమాండ్ తో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని తన సొంతూరు కిర్లంపూడిలో ఈ నెల 5న దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు బలవంతంగా ఆయనను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించినా... ముద్రగడ దీక్ష విరమించలేదు. అరెస్టైన కాపులకు బెయిల్ రావడంతో ఆయన ఇటీవలే దీక్ష విరమించారు. కొన్ని రోజులు ఇంటికే పరిమితమైన ముద్రగడ... నిన్న రాజమహేంద్రవరం ఆసుపత్రికి వెళ్లారు. తనకు వైద్యం అందించిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిని పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీక్ష కొనసాగించిన తాను, తన కుమారులు, కోడలు పూర్తిగా కోలుకున్నామని ప్రకటించారు. అయితే తన సతీమణి ఇంకా గొంతు నొప్పితో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.