: విదేశాల్లో దాగున్న రూ. 13 వేల కోట్ల నల్లధనం వెలుగులోకి!
గడచిన ఐదేళ్ల కాల వ్యవధిలో విదేశాల నుంచి అందుకున్న సమాచారంతో, లెక్కలు చూపకుండా, పన్నులు చెల్లించకుండా దాచుకున్న రూ. 13 వేల కోట్ల నల్లధనాన్ని వెలుగులోకి తెచ్చామని కేంద్రం ప్రకటించింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందిన సమాచారాన్ని క్రోఢీకరించి, పన్నులు ఎగ్గొట్టిన వారికి నోటీసులను పంపుతున్నట్టు ఐటీ-అసెస్ మెంట్ నివేదిక పేర్కొంది. జనీవాలోని హెచ్ఎస్బీసీ బ్యాంకుల్లో ఖాతాలున్న 400 మంది గురించిన సమాచారం సేకరించామని, వీరి నుంచి 5,377 కోట్ల పన్ను వసూలుకు నడుం బిగించామని తెలిపింది. జనీవా హెచ్ఎస్బీసీ లో భారతీయులకు మొత్తం 628 ఖాతాలుండగా, వాటిల్లో 213 ఖాతాల్లో లావాదేవీలు జరగడం లేదని, మరికొన్ని ప్రవాస భారతీయుల పేరిట ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇక ఆరోపణలున్న కేసులకు సంబంధించి 398 కేసుల్లో మదింపు పూర్తి చేశామని, వీటిల్లో కొన్ని ఐటీ సెటిల్ మెంట్ కమిషన్ ముందున్నాయని వివరించింది. కాగా, దీనిపై స్పందించేందుకు హెచ్ఎస్బీసీ ప్రతినిధి నిరాకరించారు. కాగా, 2013లో ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, 700 మంది భారతీయులు విదేశీ బ్యాంకుల్లో దాదాపు రూ. 5 వేల కోట్లకు పైగా దాచుకున్నట్టు వెల్లడైన సంగతి తెలిసిందే.