: ముస్లింగా సిగ్గుపడుతున్నా!... వివాదం రేపిన కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యాఖ్య!
జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముప్తీ నిన్న చేసిన వ్యాఖ్యలు పెను వివాదం రేపాయి. కశ్మీర్ లోని పాంపోర్ లో మొన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో 8 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. నిన్న మృత జవాన్లకు నివాళి అర్పించే సందర్భంగా మొహబూబా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ముస్లింగా సిగ్గుపడుతున్నా’’ అంటూ ఆమె సంచలన వ్యాఖ్య చేశారు. పవిత్ర మాసం రంజాన్ నెలలో ముస్లింలుగా చెప్పుకుంటున్న ఉగ్రవాదుల చర్యను హేయమైనదిగా అభివర్ణించిన ఆమె తాను కూడా ముస్లింనన్న విషయాన్ని ప్రస్తావించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. పవిత్ర మాసంలో జరిగిన ఈ దాడితో ముస్లింగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. రంజాన్ మాసంలో అన్ని రకాల చెడు పనులకు దూరంగా ఉండాలని అల్లా చెప్పారు. ఈ తరహా ఘటనలు కశ్మీర్ ను అప్రతిష్ఠ పాలు చేసేవే’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అక్కడ ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.