: భారత ఎన్ఎస్జీ ఆశలు సజీవం... మరోసారి కలవనున్న కూటమి
అణు సరఫరా దారుల బృందంలో చేరాలన్న భారత్ కోరిక ప్రస్తుతానికి తీరనట్టు కనిపించినా, ఆ ఆశలు సజీవంగానే ఉన్నాయి. గతవారంలో సియోల్ లో జరిగిన ప్లీనరీలో భారత్ ను చేర్చుకునే అంశంపై ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయిన గ్రూప్, ఇండియా అంశాన్ని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. చైనా నుంచి వచ్చిన బలమైన వ్యతిరేకత, మెక్సికో అడ్డుపడటంతో ఇండియాకు స్థానమిచ్చే అంశం వాయిదా పడింది. ఇక ఇదే గ్రూపు డిసెంబర్ లోగా మరోసారి సమావేశం కానుందని, తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ, భారత సభ్యత్వంపై చర్చించాలన్న అంశం ఎజెండాలో ఉంటుందని, అర్జెంటీనా అంబాసిడర్ రఫెల్ గ్రోసీ నాయకత్వంలో కమిటీ సమావేశం అవుతుందని తెలుస్తోంది. ఇండియాకు ముందుముందు ఎన్ఎస్జీలో సభ్యత్వం లభిస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోగా భారత్ ప్రవేశానికి మార్గం సుగమమవుతుందన్న నమ్మకం తమకుందని తెలిపారు. కాగా, ఎన్ఎస్జీ మరోసారి సమావేశమైనా, చైనా గట్టిగా అడ్డుకోవచ్చని తెలుస్తోంది. దీంతో ఈలోగా చైనాకు సర్దిచెప్పాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.