: దర్శనం టికెట్ తో పాటే గది కూడా: టీటీడీ నిర్ణయం
తిరుమలకు వెళ్లి దేవదేవుని దర్శించుకునేందుకు ముందస్తు ప్రత్యేక ప్రవేశం టికెట్లను కొనుగోలు చేసే వారికి అదే సమయంలో అద్దె గదుల బుకింగ్ సౌకర్యాన్ని కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 300 టికెట్లు రోజుకు 20 వేల వరకూ అమ్ముడవుతున్నాయి. దర్శనం టికెట్ సులువుగా దక్కించుకుంటున్నా, తిరుమల చేరుకున్న తరువాత వసతి కోసం ఎంతో కష్టపడాల్సి వస్తోందని భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై కసరత్తు చేసిన అధికారులు, టికెట్ తో పాటే అద్దె గదుల బుకింగ్ సౌకర్యం దగ్గర చేసేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నారు. దీనిపై ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాలని ఈఓ సాంబశివరావు నుంచి టీటీడీ ఐటీ విభాగానికి ఆదేశాలు అందాయి. త్వరలోనే కొత్త పద్ధతిలో దర్శనంతో పాటే గదుల బుకింగ్ కూ అవకాశం లభిస్తుందని అధికారులు వెల్లడించారు.