: విశాఖపట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది: ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
స్మార్ట్ సిటీ విశాఖపట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మహారాష్ట్రలోని పుణెలో ‘స్మార్ట్ సిటీ’లపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, సమ్మిళిత అభివృద్ది కోసం స్మార్ట్ సిటీల నిర్మాణానికి ప్రధాని పిలుపునిచ్చారని, దేశంలోని అన్ని నగరాలు ఇప్పుడు పోటీ పడుతున్నాయని, రాబోయే రోజుల్లో దేశంలో మరిన్ని ఆకర్షణీయ నగరాలు వస్తాయని అన్నారు. 18 నెలల క్రితం హుద్ హుద్ వల్ల విశాఖపట్టణంలో తీవ్ర నష్టం జరిగిందని, అయితే, దాని నుంచి బయటపడి వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. విశాఖను వాణిజ్య నగరంగా తీర్చిదిద్దుతున్నామని, విశాఖలో 94 వేల ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసి వందశాతం లక్ష్యం సాధించామని, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించామని చెప్పారు. ఆగస్టు నాటికి విశాఖలో ప్రతి ఇంటికీ 15-20 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని, రాష్ట్రంలోని ఇతర నగరాల అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.