: దేశంలో ఉన్న కంపెనీలు పనికిరావా..? మూటలిచ్చేవారే నీతిమంతులా..?: బొత్స
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఆమోదించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. స్విస్ ఛాలెంజ్ విధానం మంచిది కాదని కేల్కర్ కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతి వద్దని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించినా చంద్రబాబు ఆ విధానాన్నే ఎందుకు అమలు చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. దేశంలో ఉన్న కంపెనీలు భవనాల నిర్మాణాలకు పనికిరావా..? అని ఆయన దుయ్యబట్టారు. డబ్బు మూటలిచ్చేవారే నీతిమంతులా..? అని ఆయన వ్యాఖ్యానించారు.