: ఒక్క కలం పోటుతో మా కష్టాన్ని నాశనం చేస్తారా?... తప్పుడు వార్తలపై చంద్రబాబు ఫైర్!
నవ్యాంధ్ర నూతన రాజధానిలో భూమి మూడు అడుగుల మేర కుంగిపోయిందంటూ వెలువడ్డ వార్తా కథనాలపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విజయవాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఫైరయ్యారు. తాత్కాలిక సచివాలయం ఏర్పాటవుతున్న వెలగపూడిలో భూమి మూడు అడుగుల మేర కుంగిందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని మీడియా వార్తలు ప్రసారం చేసింది. దీనిని ప్రస్తావిస్తూ రాష్ట్ర విభజన నేపథ్యంలో కష్టాలున్నా నవ్యాంధ్ర నూతన రాజధానికి స్వచ్ఛందంగా తరలివస్తున్న ఉద్యోగులను ఆందోళనకు గురి చేయాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రాత్రింబవళ్లు తాము కష్ట పడి పనిచేస్తుంటే... ఇంటిలో కూర్చుని ఒక్క కలం పోటుతో తమ కష్టాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఒకింత ఆగ్రహంతో ఊగిపోయారు. అమరావతికి వచ్చి, అక్కడి పరిస్థితులను పరిశీలించి వార్తలు రాస్తే ఓకే గాని, ఇంటిలో కూర్చుని తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని ఆయన చెప్పారు. సదరు వార్తా కథనాలను రాస్తున్న మీడియా ప్రతినిధులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని వ్యవహరిస్తారని భావిస్తున్నానని పేర్కొన్న ఆయన... లేని పక్షంలో అలాంటి వారిని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసంటూ వార్నింగ్ ఇచ్చారు.