: ‘బురిడీ బాబా’గా భాను కిరణ్!... జైల్లో ఉంటూనే రూ.150 కోట్లు కొల్లగొట్టిన సూరి హంతకుడు!


భాను కిరణ్ గుర్తున్నాడా? దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్రకు ఫ్యాక్షన్ ప్రత్యర్థిగా కొనసాగిన మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి (మద్దెలచెరువు సూరి)కి అనుచరుడిగా మసలిన వ్యక్తి. తదనంతరం తాను నమ్ముకుని వెంట నడిచిన నేతనే పట్టపగలు హైదరాబాదులో హత్య చేశాడు. మద్దెలచెరువు సూరి హత్య కేసులో అరెస్టైన ఈ అనంతపురం వాసి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటూనే అతడు ‘బురిడీ బాబా’గా మారాడు. ఇటీవల హైదరాబాదులోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ యాజమాని మధుసూదన్ రెడ్డిని బురిడీ కొట్టించి రూ.1.33 కోట్లతో పరారై ఆ తర్వాత పోలీసులకు చిక్కిన శివానంద బాబా తరహాలో భాను కిరణ్ కూడా ఓ నయా మోసానికి పాల్పడ్డాడు. సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను నిండా ముంచేసి దాదాపు రూ.150 కోట్లు కొల్లగొట్టిన భాను కిరణ్ మోసగించిన వైనాన్ని తెలుసుకుని తెలంగాణ పోలీసులే నోరెళ్లబెట్టారట. వివరాల్లోకెళితే... సాధారణంగా వర్షాకాలంలో పడే పిడుగులు అత్యంత శక్తిమంతమైనవి. ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుని భాను కిరణ్ జైల్లో ఉంటూనే 18 మంది సభ్యులతో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. బెంగళూరు కేంద్రంగా ‘కోహ్లీ గ్యాంగ్’ పేరిట రంగంలోకి దిగిన ఈ నయా ముఠా... అక్కడ ఓ కార్పొరేట్ కార్యాలయాన్ని కూడా తెరిచింది. పిడుగు పాటు సమయంలో ఆకాశం నుంచి పడే శక్తిని ఒడిసిపడితే కోట్లాది రూపాయల ఖరీదు చేసే యురేనియం చేజిక్కినట్లేనని ఆ గ్యాంగ్ ప్రచారం ప్రారంభించింది. ఈ ముఠా మాయ మాటలకు తెలుగు, కన్నడ సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు కూడా ఆకర్షితులయ్యారు. పిడుగుల్లోని శక్తిని యురేనియంగా మార్చేందుకు ప్రయోగాలు చేయాలంటూ ఆ ముఠా పలికిన మాటలను సినీ, పారిశ్రామిక ప్రముఖులు గుడ్డిగా నమ్మేశారు. ప్రయోగాలకంటూ ఆ ముఠా అడిగిందే తడవుగా ముందూ వెనుకా చూడకుండా కోట్ల కొలదీ నిధులను అందజేశారు. అయితే ఆ తర్వాత ఆ ముఠా నుంచి మాట కూడా వినిపించకపోవడంతో తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా కార్యకలాపాలపై సమగ్ర సమాచారం సేకరించారు. ఆ తర్వాత బెంగళూరులో తిష్ట వేశారు. రోజుల తరబడి నిఘా వేసిన పోలీసులు ఎట్టకేలకు ముఠా గుట్టును కనిపెట్టారు. వెనువెంటనే సదరు ముఠా ఏర్పాటు చేసుకున్న కార్పొరేట్ కార్యాలయంపై దాడి చేశారు. ముఠాలోని మొత్తం 18 మంది సభ్యులను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా సదరు ముఠా సభ్యులు తమ నేత భాను కిరణ్ అని చెప్పడంతో పోలీసులు షాకయ్యారట. ఆ ముఠా చెప్పిన విషయాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్వరలోనే భాను కిరణ్ ను కూడా ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై నేటి ఉదయం పలు ఛానెళ్లలో వార్తా కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

  • Loading...

More Telugu News