: గంటన్నర యోగాకు రూ.1.5 కోట్లు కొట్టేసిన బిపాసా!... వివాదంలో సిద్దూ సర్కారు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సిద్దూ... వాటి నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. తాజా వివాదానికి కారణం మాత్రం మొన్న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బెంగళూరులో అధికారికంగా నిర్వహించిన యోగా శిబిరం కావడం గమనార్హం. అసలు ఈ వివాదమేంటంటే... సదరు యోగా శిబిరానికి కర్ణాటక ప్రభుత్వం బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసును ఆహ్వానించింది. ఏకంగా సర్కారు నుంచే స్వయంగా ఆహ్వానం అందడంతో దానిని క్యాష్ చేసుకునేందుకు మొగ్గుచూపిన బిపాసా... గంటన్నర పాటు యోగా శిబిరంలో పాల్గొంటే రూ.1.5 కోట్లు కావాలని అడిగింది. ఇందుకు సిద్దూ సర్కారు కూడా ముందూ వెనుకా చూడకుండా ఒప్పేసుకుంది. ఇంకేముంది, మొన్న బెంగళూరులో జరిగిన యోగా శిబిరం కోసం బిపాసా ముంబైలో ఫ్లైటెక్కి బెంగళూరులో ల్యాండైంది. నేరుగా యోగా శిబిరానికి వెళ్లిన బిపాసా ఒంటికి బిగుతైన దుస్తులేసుకుని యోగా ట్రైనర్ లా పోజిచ్చింది. గంటన్నర పాటు అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఆమె యోగా విన్యాసాలు చేసింది. బిపాసా యోగా విన్యాసాలు చేస్తున్నంత సేపు సిద్దరామయ్య సహా కర్ణాటక కేబినెట్ మొత్తం ఆమె వెనుకే కూర్చుండిపోయింది. గంటన్నర సమయం ముగిసింది. బిపాసా స్టేజ్ దిగేసింది. వెంటనే తిరిగి ముంబై వెళ్లిపోయింది. వెళ్లేటప్పుడు కర్ణాటక సర్కారు ఇచ్చిన కోటిన్నరను కూడా పట్టుకెళ్లింది. ఈ మొత్తంతో పాటు ముంబై నుంచి బిపాసాకు రానుపోను ఫ్లైట్ టికెట్లు, బెంగళూరులో స్వల్ప విడిది కోసం సిద్దూ సర్కారు మరింత మేర ఖర్చు చేసిందట. ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడంతో సిద్దూ సర్కారుపై విమర్శల జడివాన కురుస్తోంది. బీదర్ లో శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్... సిద్దూ సర్కారుపై అంతెత్తున ఎగిరి పడ్డారు. ఇంకాస్త జనం రావాలనుకుంటే సన్నీలియోన్ ను పిలవకపోయారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.