: మద్రాస్, బాంబే హైకోర్టుల పేరు మార్పునకు రంగం సిద్ధం


మద్రాస్ చెన్నైగా, బోంబే ముంబైగా మారి చాలా కాలమైంది. కానీ ఈ రెండు నగరాల్లో ఉన్న హైకోర్టులు స్థానిక పేర్లతోనే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో వీటి పేర్ల మార్పునకు సంబంధించిన బిల్లుపై న్యాయ శాఖ ఓ కేబినెట్ నోట్ ను రూపొందించింది. కేబినెట్ ఆమోదం అనంతరం ఈ బిల్లు వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానుంది. పేర్ల మార్పునకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మద్రాస్ హైకోర్టు, బాంబే హైకోర్టుల అంగీకారం లభించినట్టు న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. హైకోర్టుల పేరు మార్చే విషయమై రాష్ట్రపతి అధికారాలను వినియోగించుకోవాలని అనుకున్నామని, కానీ ఆచరణాత్మకం కాదని భావించడంతో గత ఆరు నెలల కాలంలో బిల్లును రూపొందించినట్టు వర్గాలు తెలిపాయి. ఇక కలకత్తా హైకోర్టు పేరును కోల్ కతా హైకోర్టుగా మార్చే విషయమై కోర్టు నుంచి ఇంకా అంగీకారం రాలేదని మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పేరు మార్చాలని కోరిందని, ఈ విషయంలో న్యాయ శాఖ రాసిన లేఖలకు హైకోర్టు ఇంకా స్పందించలేదని తెలిపాయి. అలాగే, ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చడంతో అక్కడి హైకోర్టు పేరు ఉచ్చారణలో కూడా ఆ మేరకు మార్పు చేయాలన్న డిమాండ్లు న్యాయ శాఖ ముందుకు వచ్చాయి. ఇక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి హైకోర్టును విభజించాల్సి ఉండడంతో పేర్లు మార్చే విషయంలో న్యాయశాఖ వేచి చూసే ధోరణిలో ఉందని ఓ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News