: అద్భుతం... ఇక అమెరికా పసిఫిక్ ప్రాంతాలను సర్వనాశనం చేయొచ్చు: కిమ్ జాంగ్ ఉన్
అత్యాధునిక మధ్యస్త రకం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ శాస్త్రవేత్తలను ప్రశంసల్లో ముంచెత్తారు. ఇక పసిఫిక్ తీరంలోని అమెరికా మిలటరీ కేంద్రాలన్నింటిపైన దాడులు చేయవచ్చని ఆయన అన్నారు. "ఇకపై ఉత్తర కొరియా ప్రాక్టికల్ గా పసిఫిక్ తీరంలోని ప్రాంతాలపై దాడులు చేసి నాశనం చేయగల సత్తాను పొందింది. ఈ క్షిపణి ప్రయోగం విజయవంతంతో దేశ అణు దాడుల సామర్థ్యం మరింతగా పెరిగింది" అని ఆయన వ్యాఖ్యానించినట్టు కేసీఎన్ఏ న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. కాగా, ఈ క్షిపణి 2,500 నుంచి 4 వేల కిలోమీటర్ల దూరం వరకూ దూసుకు వెళుతుందని, అమెరికాలోని గువామ్ వరకూ ఉన్న అన్ని యూఎస్ మిలటరీ బేస్ స్టేషన్లూ దీని పరిధిలోనే ఉంటాయని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా వరుస క్షిపణి పరీక్షల్లో విఫలమౌతూ వస్తున్న నార్త్ కొరియా, ఈ దఫా విజయం సాధించడం గమనార్హం. ఈ ప్రయోగాన్ని ఐరాస సహా పలు దేశాలు ఖండించాయి. ఉత్తర కొరియా కావాలనే ఈ తరహా పరీక్షలు చేపట్టి రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.