: కుడి కాలికి గాయమైతే ఎడమ కాలుకు ఆపరేషన్ చేసిన వైద్యులు
అదో కార్పొరేట్ ఆస్పత్రి. అత్యుత్తమ వైద్యం అందుతుందని ఆశించడం సహజం. కానీ అక్కడి వైద్యులు ఏం చేశారో తెలుసా...? కుడి కాలుకి గాయమైందని ఆస్పత్రిలో చేరితే... ఎడమకాలికి ఆపరేషన్ చేశారు. దీనిపై ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఢిల్లీ అషోక్ విహార్ ప్రాంతానికి చెందిన రవి రాయ్ సీఏ విద్యార్థి. గత ఆదివారం మెట్లు ఎక్కుతున్న క్రమంలో కాలు పట్టుతప్పి కింద పడిపోయాడు. దీంతో కుడి కాలుకి గాయమైంది. చికిత్స కోసం షాలిమార్ బాగ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్ కు తరలించారు. సీటీ స్కాన్, ఎక్స్ రే తదితర పరీక్షలు నిర్వహించిన అనంతరం చీలమండ వద్ద ఫ్రాక్చర్ అయిందని, కండీషన్ సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పారు. చీలమండ వద్ద సపోర్ట్ కోసం వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. వైద్యులు చెప్పినదానికి రవిరాయ్ కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. రవిరాయ్ ను ఆపరేషన్ గదికి తరలించారు. మత్తు మందు ఇచ్చి సర్జరీ పూర్తి చేశారు. రవిరాయ్ కు స్పృహ వచ్చిన తర్వాత చూసుకుంటే కుడి కాలుకి బదులు నిక్షేపంగా ఉన్న ఎడమ కాలుకి ఆపరేషన్ చేసినట్టు గుర్తించాడు. జరిగిన తప్పిదానికి ఆస్పత్రి విచారం వ్యక్తం చేసి చేతులు దులుపుకుంది. దీంతో చికిత్స కోసం రవిరాయ్ ను మరో ఆస్పత్రికి తరలించారు అతడి కుటుంబ సభ్యులు. ఇందులో పూర్తిగా నిర్లక్ష్యం ఉందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, భారతీయ వైద్య మండలి, ఢిల్లీ వైద్య మండలిని కూడా ఆశ్రయిస్తామని బాధితుడి తండ్రి తెలిపారు. దీనిపై సుమోటోగా తాము విచారణ చేపట్టామని, తగిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ వైద్య మండలి రిజిస్ట్రార్ గిరీష్ త్యాగి పేర్కొన్నారు.