: రూ.20 లక్షలిస్తే టాప్ ర్యాంక్!... బీహార్ ‘టాపర్స్’ గుట్టు ఇదేనట!
చదువు రాకున్నా టాప్ ర్యాంక్ కావాలా? అయితే ఇక్కడ కుదరదు కానీ, బీహార్ వెళితే మాత్రం ఓ రూ.20 లక్షలు మనవి కావనుకుంటే ఈజీగా టాప్ ర్యాంక్ వచ్చేస్తుంది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన బీహార్ టాపర్స్ కుంభకోణంలో ఇదే రీతిన ఆ రాష్ట్రానికి చెందిన చదువు రాని దద్దమ్మలు కూడా టాప్ ర్యాంకులు కొట్టేశారట. ఈ మేరకు ఇటీవలే అరెస్టైన ఈ కుంభకోణం కీలక సూత్రధారి, ఆ రాష్ట్ర బీఎస్ఈబీ మాజీ చైర్మన్ లాల్ కేశ్వర్ ప్రసాద్ సింగ్ ఈ విషయాన్ని ఒప్పేసుకున్నారు. టాప్ ర్యాంకు కావాలనుకునే ఒక్కో విద్యార్థి నుంచి తాను రూ.20 లక్షలు తీసుకున్నానని సింగ్ నేరం ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన నుంచి అసలు విషయాన్ని రాబట్టిన పోలీసులు నిన్న ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. టాప్ ర్యాంకుల కోసం వచ్చే విద్యార్థుల వద్ద రూ.20 లక్షల చొప్పున వసూలు చేసిన ప్రసాద్ సింగ్... కళాశాలలకు గుర్తింపు ఇచ్చేందుకు ఒక్కో యాజమాన్యం వద్ద రూ.4 లక్షలు వసూలు చేశానని చెప్పారు.