: నన్ను అనవసర విషయాల్లోకి లాగొద్దు: ఆర్బీఐ గవర్నర్ రాజన్
ఇంకా రెండున్నర నెలలు ఈ పదవిలో ఉంటానని, ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నివసిస్తానని, అయితే, భారత్ లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కనుక తనను అనవసరమైన విషయాల్లోకి లాగవద్దని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రెడిట్ రేటు మందగించడానికి అధిక వడ్డీ రేట్లు కారణం కాదని, ప్రభుత్వ నిర్వహణలోని బ్యాంకులు మొండి బకాయిలతో అవస్థలు పడుతున్నాయని అన్నారు. బ్యాలెన్స్ షీట్లను క్లీన్ చేయటాన్ని ఆయన సమర్థించుకున్నారు. బ్యాలెన్స్ షీట్లను పటిష్ఠపరచడం, రుణాలను పెంచడం వంటివి చాలా సున్నితమైన అంశాలని, ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐలు ప్రభుత్వ నిర్వహణలోని బ్యాంకులకు సాయపడుతున్నాయన్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మొండిబకాయిలతో అవస్థలు పడుతున్న కారణంగా మిగిలిన రుణదాతలు అప్పులు ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదని రాజన్ అన్నారు.