: నెల రోజుల వ్యవధినిస్తూ, చేతులెత్తేసిన కృష్ణ వాటర్ బోర్డు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది నీటి వాడకం విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడంలో యాజమాన్య బోర్డు చేతులెత్తేసింది. సమస్య పరిష్కారానికి మార్గం లభించని స్థితిలో, మరో నెల రోజుల పాటు గత సంవత్సరం మాదిరిగానే నీటి నిర్వహణ జరుగుతుందని తేల్చి చెబుతూ, ఈ లోగా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూర్చుని, చర్చలు జరిపి, ఓ ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. రెండు రాష్ట్రాలూ నీటి నిర్వహణపై ఓ అంగీకారానికి రావాల్సిందేనని, అంతకు మించి మార్గం లేదని అభిప్రాయపడింది. తీసుకున్న నిర్ణయాన్ని నెల రోజుల్లో తమకు తెలియజేయాలని పేర్కొంది. ఏకాభిప్రాయానికి రాలేని పరిస్థితి ఏర్పడితే, తాము కల్పించుకుని తుది ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలూ వెలువడకపోగా, తిరిగి రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని బోర్డు యాజమాన్యం ఆదేశించడం చర్చనీయాంశమైంది.