: స్వామి రియల్ టార్గెట్ అరుణ్ జైట్లీనే!... డిగ్గీరాజా ఆసక్తికర కామెంట్!
కాంగ్రెస్ పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి వరుసగా పేల్చుతున్న మాటల తూటాల్లోని అంతరార్థంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ను టార్గెట్ చేసి పెద్ద చర్చకే తెర తీయడమే కాకుండా... తాననుకున్న మేరకు రాజన్ కు రెండో టెర్మ్ ను స్వామి నిష్ఫలం చేశారు. తాజాగా చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణియన్ లక్ష్యంగా నేటి ఉదయం ట్విట్టర్ లో సుబ్రహ్మణ్య స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరవింద్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ట్వీట్లపై డిగ్గీ రాజా వేగంగా స్పందించారు. సుబ్రహ్మణ్య స్వామి అసలు టార్గెట్ అరవింద్ కాదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీనే సుబ్రహ్మణ్య స్వామి అసలు టార్గెట్ అని ఆయన ట్వీట్ చేశారు.