: కిర్లంపూడికి ముద్రగడ పయనం!... దాసరి, చిరుతో చర్చించాకే ఇంటిబాట పట్టిన కాపు నేత!


కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు ఆమరణ దీక్ష విరమణకు తలూపారు. తుని విధ్వంసకారుల పేరిట ప్రభుత్వం అరెస్ట్ చేసిన కాపులను తక్షణమే విడుదల చేయడంతో పాటు కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ తో ముద్రగడ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంతింటిలో ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే తొలి రోజునే రంగంలోకి దిగిన పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలోనూ ముద్రగడ దీక్ష కొనసాగించారు. ఈ క్రమంలో విడతలవారీగా అరెస్టైన 13 మంది కాపులకు బెయిల్ వచ్చేసింది. దీంతో దీక్ష విరమణకు సరేనన్న ముద్రగడ... మరిన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. ముద్రగడ తాజా డిమాండ్లకు ప్రభుత్వం ససేమిరా అనడంతో నేటి ఉదయం ఆసుపత్రి నుంచే కాపు ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవిలతో ఫోన్ లో మంతనాలు చేసిన ముద్రగడ చర్చలు జరిపారు. అనంతరం వారిద్దరి సూచనల మేరకు దీక్ష విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముద్రగడ తన సతీమణితో కలిసి కొద్దిసేపటి క్రితం కిర్లంపూడి బయలుదేరారు. మరకాసేపట్లో ఆయన కిర్లంపూడిలోని తన స్వగృహంలో దీక్ష విరమించే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News