: సంవత్సరానికి రూ. 500 కోట్ల వేతనం... సీఈఓను చేయలేదని రాజీనామా!
ప్రపంచంలో అత్యధిక వేతనాన్ని తీసుకుంటున్న ఉద్యోగుల్లో ఒకరిగా పేరున్న జపాన్ సాఫ్ట్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నికేష్ అరోరా, తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేశారని, దాన్ని ఆమోదించామని, నేటి నుంచి అమలవుతుందని సంస్థ ప్రకటించింది. కాగా, గత సంవత్సరం రూ. 500 కోట్లను వేతనంగా తీసుకున్న ఆయన, తనను సాఫ్ట్ బ్యాంకుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించలేదన్న మనస్తాపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. "అంతా మందిచే. మసా సీఈఓగా మరింత కాలం పనిచేయాలని అనుకుంటున్నారు. ఇక ఇక్కడి నుంచి కదిలే సమయం వచ్చింది" అని అరోరా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తనను సీఈఓగా చేయాలని ఆయన కోరగా, అందుకు ప్రస్తుత చైర్మన్, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న మసయోషి అంగీకరించలేదని సాఫ్ట్ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకును మరింతగా విస్తరించాల్సి వున్నందున భవిష్యత్తులో అరోరాకు అవకాశం లభిస్తుందని సర్దిచెప్పాలని చూసినప్పటికీ, ఆయన వినిపించుకోలేదని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గూగుల్ లో ఉన్నతోద్యోగిగా పనిచేసిన అరోరా, సాఫ్ట్ బ్యాంక్ లో చేరిన తరువాత, కొన్ని బ్యాడ్ డీల్స్ చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.