: ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నూ వదలని సుబ్రహ్మణ్య స్వామి!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రఘురాం రాజన్ ను తరిమేసిన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, ఆ పోస్టుకు ఎంపిక కావచ్చని భావిస్తున్న ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 2013లో ఆయన భారత్ కు వ్యతిరేకంగా పనిచేయాలని అమెరికాకు సలహా ఇచ్చారని ఆరోపించారు. " 13/3/2013న ఇండియాకు వ్యతిరేకంగా పనిచేయాలని అమెరికాకు నూరి పోసింది ఎవరు? అమెరికా ఫార్మా రంగ ప్రయోజనాలు కాపాడుకోవాలంటే భారత్ ను అడ్డుకోవాలన్నది ఎవరు? అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక శాఖ ఉద్యోగి. తక్షణం తొలగించండి" అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఆపై జీఎస్టీ అమలు కాకుండా కాంగ్రెస్ ను రెచ్చగొట్టి, కొత్త మెలికలు పెట్టేలా చేసింది కూడా ఆయనేనని, ఆయన వాషింగ్టన్ డీసీకి చెందిన వ్యక్తని ఆరోపించారు. పలు న్యూస్ సర్వేలు తదుపరి ఆర్బీఐ గవర్నరుగా అరవింద్ నియామకం కావచ్చని అంచనాలు వేస్తున్న వేళ, స్వామి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడం గమనార్హం.