: కళానికేతన్ మరో దుస్సాహసం!... ధర్మవరం ఎమ్మెల్యేకు రూ.2 కోట్ల లంచం ఇవ్వజూపిన వైనం!
చేనేత కార్మికులను నిండా ముంచేసిన ప్రముఖ వస్త్ర విక్రయ శాల కళానికేతన్ ఇప్పటికే అప్రతిష్ఠ మూటగట్టుకుంది. సంస్థ డైరెక్టర్ లక్ష్మీ శారదను అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ధర్మవరం చేనేత కార్మికులకు రూ.9 కోట్ల బకాయి పడ్డ కళానికేతన్ యాజమాన్యం... రాష్ట్రం మొత్తం మీద నేత కార్మికులకు రూ.65 కోట్ల మేర బాకీ ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో కేసు నుంచి బయటపడేందుకు కళానికేతన్ యాజమాన్యం మరో దుర్మార్గమైన చర్యకు పాల్పడింది. కేసు నుంచి తప్పించాలంటూ ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఆశ్రయించింది. నేత కార్మికులకు చెల్లించేందుకు డబ్బులు లేవని చెబుతున్న కళానికేతన్ యాజమాన్యం... తమను కేసు నుంచి బయటపడేస్తే రూ.2 కోట్ల మేర లంచం ఇచ్చుకుంటామంటూ ఎమ్మెల్యేకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఎమ్మెల్యే ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో పాటు తనకే లంచం ఇవ్వజూపేందుకు యత్నించిన కళానికేతన్ దుస్సాహసాన్ని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. విషయం తెలిసి తనను సంప్రదించిన మీడియాకు కూడా ఎమ్మెల్యే వాస్తవాన్ని వెల్లడించారు. తనకు కళానికేతన్ రూ.2 కోట్ల మేర లంచం ఇచ్చేందుకు సిద్ధమైన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు.