: కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు.. కోడెలపై చర్యలు తీసుకోవాలి: అంబటి
గత ఎన్నికల్లో డబ్బు ఎక్కువగా ఖర్చయిందంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. తక్షణమే కోడెలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని కోసం విచారణ కూడా జరిపించాల్సిన అవసరం లేదని, కోడెలపై నేరుగా చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. చట్టసభ సభ్యుడిగా, స్పీకర్‌గా కొనసాగే అర్హత కోడెలకు లేదని ఆయన విమర్శించారు. కోడెల వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘చట్టప్రకారం ఎలా చర్య తీసుకోవాలి..?’ అనే దానిపై తాము న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు అంబటి రాంబాబు పేర్కొన్నారు. రూ.11 వందల కోట్లు సంపాదించాలనే ఆలోచనలో కోడెల ఉన్నారని ఆయన ఆరోపించారు. కోడెల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. తక్షణమే కోడెల తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.