: అరంగేట్రంలోనే అదరగొట్టాలన్న కల నెరవేరింది: బరీందర్ శ్రాన్
భారత క్రికెట్ జట్టుకు ఎంపికైతే, తానాడిన తొలి మ్యాచ్ లోనే చక్కగా రాణించాలని కలలు కనేవాడినని, జింబాబ్వే పర్యటన రూపంలో తన కల నెరవేరిందని బౌలర్ బరీందర్ శ్రాన్ వ్యాఖ్యానించాడు. హరారేలో నిన్న జరిగిన రెండో టీ-20 ద్వారా తొలి టీ-20 మ్యాచ్ ఆడిన శ్రాన్, నాలుగు వికెట్లు తీసి రాణించిన సంగతి తెలిసిందే. తన ప్రదర్శనపై మీడియాతో మాట్లాడుతూ, ధోనీ కెప్టెన్సీలో ఆడే అవకాశం రావడం తన అదృష్టమని అన్నాడు. ఒకేసారి వన్డేలు, టీ-20ల్లో తనకు అవకాశమిచ్చిన ధోనీకి కృతజ్ఞతలు చెప్పాడు. టీ-20ల్లో బౌలర్లపై ఒత్తిడి అధికమని, ఆశిష్ నెహ్రా, భువనేశ్వర్ కుమార్ ల సలహాలతో తన బౌలింగ్ ను మెరుగుపరచుకున్నానని చెప్పాడు.