: రాందేవ్ కు యోగా డే గిఫ్ట్... 1000 ఎకరాలు ఇవ్వనున్న మోదీ సర్కారు!
మోదీ సర్కార్ నుంచి యోగా గురు బాబా రాందేవ్ భారీ గిఫ్ట్ ను అందుకోనున్నారు. ఫరీదాబాద్ సమీపంలోని ఆరావళి పర్వతసానువుల్లో ఉన్న కోట్ గ్రామ సమీపంలో యోగా లేదా హెల్త్ కేర్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఆయనకు ఏకంగా 1000 ఎకరాల భూమిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లు 2012లో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆగిపోగా, చట్ట సవరణ ద్వారా రాందేవ్ కు భూమి ఇవ్వాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాను ఏర్పాటు చేయబోయే భారీ సెంటర్ గురించి రాందేవ్ స్వయంగా వెల్లడిస్తారని సమాచారం. ఇదే విషయమై పతంజలి సంస్థను వివరణ కోరగా, "అంత తొందరెందుకు. ప్రకటన వెలువడేంత వరకూ వేచి చూడవచ్చుగా. ఫరీదాబాద్ లో రాందేవ్ బాబా ఓ భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడికి ముఖ్య అతిథిగా అమిత్ షా వస్తున్నారు. ఇక్కడ ఏడు ప్రపంచ రికార్డులు బద్దలవుతాయి. అక్కడే ప్రకటన వెలువడుతుంది" అని ఓ ప్రతినిధి తెలిపారు. కాగా, ఇటీవల ఓ సమావేశంలో రాందేవ్ మాట్లాడుతూ, తాను రూ. 5 వేల కోట్లతో ఓ యూనివర్శిటీని, అంతర్జాతీయ వైద్య కేంద్రాన్ని స్థాపించనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.