: రేవంత్... ఏపీలో చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం కాదా?: ప్రశ్నించిన గుత్తా సుఖేందర్
ప్రతిపక్ష పార్టీల్లోని ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటూ, కేసీఆర్ రాజకీయ వ్యభిచారానికి తెరతీశారని తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇక్కడ కేసీఆర్ వైఖరిని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చేస్తున్న రాజకీయ వ్యభిచారం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు తప్పు చేస్తున్నట్టుగా రేవంత్ ఎందుకు చెప్పడం లేదని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డిని సాంఘిక బహిష్కరణ చేయాలని, తెలంగాణలో ఆయన్ను తిరగనివ్వరాదని వ్యాఖ్యానించిన గుత్తా, సమయం వచ్చినప్పుడు తాను కాంగ్రెస్ నుంచి సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.