: ఇండియాకు ఏ లబ్ధి చేకూర్చినా, పాక్ కూ చేయాల్సిందే: చైనా కొత్త మెలిక
ఇండియాకు అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న చైనా, తాజాగా మరో కొత్త మెలిక పెట్టింది. ఎన్ఎస్జీలో ఇండియా ప్రవేశం కోసం ఎటువంటి నిబంధనల మినహాయింపులు ఇచ్చినా, వాటినే పాకిస్థాన్ కూ ఇవ్వాలని డిమాండ్ చేసింది. పాక్ దగ్గర కూడా అణు పరిజ్ఞానం ఉందని గుర్తు చేసిన చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్, ఎన్ఎస్జీలో భారత్ చేరితే, పాక్ కూడా చేరాలన్నది తమ అభిమతమని చెప్పింది. అణు పరీక్షలు నిర్వహించే దేశాలను దూరంగా ఉంచాలన్న ఎన్ఎస్జీ నిబంధనలను గుర్తు చేస్తూ, పాక్ లో అణు పరీక్షలు ఆ దేశ సైంటిస్టు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ చేశారని, దానికి ప్రభుత్వ మద్దతు లేదని, పాక్ ప్రభుత్వం అణు కార్యకలాపాలకు వ్యతిరేకమని కొత్త వ్యాఖ్యలు చేసింది. అణు పరీక్షలు చేసినందుకు పాక్ ప్రభుత్వం ఆయన్ను శిక్షించిందని ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. వాస్తవానికి తమ దేశపు అణు పరిజ్ఞానాన్ని విదేశాలకు అమ్ముకున్నందుకు ఖాదిర్ పై కేసు నమోదు కాగా, ఆయన ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. అసలు నిజాన్ని దాచి, పాక్ కు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తున్న చైనా వైఖరిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.