: ఇండియాలోకి దూసుకొచ్చిన చైనా బాంబర్ జేహెచ్-7!
చైనా పీపుల్స్ ఆర్మీ మరోసారి భారత సైన్యాన్ని రెచ్చగొట్టింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ, చైనాకు చెందిన బాంబర్ విమానం జేహెచ్-7 భారత్ లోకి దూసుకొచ్చింది. ఇండో-చైనా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన అక్సాయి చిన్ వద్ద జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ బాంబర్ విమానం 107 నిమిషాలు ప్రయాణించిందని, ఆపై చైనా వైపు వెళ్లిపోయి అదృశ్యమైందని తెలుస్తోంది. కాగా, చైనా విమానాలు భారత సరిహద్దులు దాటడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు ఫైటర్ జెట్లు ఇండియా వైపు వచ్చి కవ్వించాయి. తాజా ఘటనలో యుద్ధ విమానం కొన్ని ఫుడ్ క్యాన్స్, సిగరెట్ ప్యాకెట్లు, చైనా భాషలో రాసున్న కొన్ని కాగితాలను వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు సైన్యాధికారులు వెల్లడించారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద దాదాపు 250 మంది చైనా సైనికులు సరిహద్దులు దాటి వచ్చి, ఆపై పొరపాటు జరిగిందని చెప్పి, చాక్లెట్లు ఇచ్చి వెనక్కు మళ్లిన సంగతి తెలిసిందే. చైనా సైన్యం పదే పదే చొరబాట్లు చేస్తుండటంపై భారత సైన్యాధికారులు సీరియస్ గా ఉన్నారు.