: ఏలూరులో నకిలీ పోలీసుల హల్ చల్!... యువతి కిడ్నాప్ యత్నాన్ని భగ్నం చేసిన జనం!
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నేటి ఉదయం ఇద్దరు నకిలీ పోలీసులు హల్ చల్ చేశారు. ఉదయమే రోడ్డు మీదకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు అటుగా వెళుతున్న ఇద్దరు యువకులు, ఓ యువతిని ఆపేశారు. తాము పోలీసులమంటూ చెప్పుకున్న దుండగులు తనిఖీల పేరిట బాధితులను హడలెత్తించారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులను భయభ్రాంతులను చేసిన దుండగులు యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే ఈ మొత్తం తతంగాన్ని పరిశీలించిన అక్కడి స్థానికులు వేగంగా స్పందించారు. యువతిని కిడ్నాప్ చేసేందుకు దుండగుడు చేసిన యత్నానికి చెక్ పెట్టారు. ఈ క్రమంలో అప్పటిదాకా పోలీసుగా దర్పం వెలగబెట్టిన ఓ దుండగుడు కాళ్లకు బుద్ధి చెప్పాడు. మరో దుండగుడు కూడా పరుగు అందుకునేలోగానే అతడిని స్థానికులు పట్టేశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.