: చిత్తూరు వాణిజ్య పన్నుల శాఖకు ఉగ్రవాదుల లేఖ
చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి ఉగ్రవాద లేఖ రావడం కలకలం సృష్టిస్తోంది. ఆఫీసుకు వచ్చిన ఓ లేఖపై బిన్ లాడెన్ చిత్రం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. వాణిజ్య పన్నుల శాఖ డీసీ పేరిట వచ్చిన లేఖపై ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు. 'ది బేస్ మూమెంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ అల్లా' అంటూ లేఖ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయన్న అనుమానాలు, ఇటీవల చిత్తూరు కోర్టులో బాంబు పేలడం, ప్రపంచ ప్రసిద్థ తిరుమల క్షేత్రంలో విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర చేయవచ్చన్న అధికారుల హెచ్చరికల నేపథ్యంలో, తాజా లేఖను సీరియస్ గా పరిగణిస్తున్నట్టు చిత్తూరు సీసీఎస్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ లేఖను ఎవరు రాశారు? ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు? అన్న విషయాలపై దర్యాఫ్తు చేపట్టినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.