: ముద్రగడ దీక్ష మరో రోజు పొడిగినట్టే!... ముగ్గురు ‘తుని’ నిందితుల బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా!
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ చేపట్టిన ఆమరణ దీక్ష మరో రోజు పొడిగినట్లే కనిపిస్తోంది. తుని విధ్వంసకారుల పేరిట అరెస్ట్ చేసిన 13 మంది కాపు యువకులను బేషరతుగా విడుదల చేయడంతో పాటు కాపులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఈ నెల 5న దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష విరమించాలని అధికారులు చేసిన విజ్ఞప్తికి ముద్రగడ ససేమిరా అన్నారు. అయితే ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు సరేనన్న ముద్రగడ... అరెస్టైన మొత్తం 13 మందికి బెయిల్ వస్తేనే దీక్ష విరమిస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పటికే 10 మందికి బెయిల్ లభించింది. మరో ముగ్గురికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో వారికి కూడా బెయిల్ వచ్చే దాకా ముద్రగడ దీక్ష విరమించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ముద్రగడ దీక్ష మరో రోజు పెరగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.