: సహజీవనం అత్యాచారం ఎలా అవుతుంది?: పదేళ్ల శిక్షపడ్డ వ్యక్తిని విడుదల చేసిన ఢిల్లీ హైకోర్టు
అత్యాచార ఆరోపణలపై పదేళ్ల జైలు శిక్ష పడ్డ ఓ వ్యక్తి నిరపరాధని గుర్తిస్తూ, ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ యువతి పెట్టిన కేసు మేరకు నిందితుడిని 2011లో అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 506 (కుట్రపూరిత నేరం) కింద కేసు పెట్టారు. రెండేళ్ల పాటు కేసును విచారించిన ట్రయల్ కోర్టు 2013లో పదేళ్ల జైలు శిక్షను, రూ. 15 వేల జరిమానాను విధించింది. తాను అత్యాచారం చేయలేదని వాదిస్తూ, నిందితుడు హైకోర్టుకు అపీలు చేయగా, కేసును విచారించిన న్యాయమూర్తి, ట్రయల్ కోర్టు తీర్పును కొట్టేశారు. ఈ కేసులో వీరిద్దరూ సహజీవనం చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని, పదేపదే ఎలా అత్యాచారం చేశారని చెప్పగలరని ప్రశ్నించిన న్యాయమూర్తి ప్రతిభా రాణి, వీరిద్దరూ కొన్ని బలహీన క్షణాల్లో తప్పు చేసి, ఆపై దాన్ని కొనసాగించారని భావిస్తున్నట్టు తెలిపారు. తన భర్తకు కావాలనే దూరంగా ఉన్న ఫిర్యాదిదారు, నిందితుడితో సహజీవనం చేసిందని, అత్యాచారం జరిగిందన్న ఆమె ఆరోపణలు నమ్మశక్యంగా లేవని అన్నారు. విచారణలోని ప్రతి దశలోనూ ఫిర్యాదిదారు మాట మార్చుతూ రావడం రికార్డుల్లో ఉందని, దాని ఆధారంగానే కేసు కొట్టేస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు.