: సిగ్గు చేటు... ప్రపంచ 'హాల్ ఆఫ్ షేమ్' జాబితాలో ఎస్బీఐ


ప్రజలు తమ డబ్బును పొదుపు చేసుకుంటుంటే, వాటిని రుణాల రూపంలో బడాబాబులకు ఇస్తూ, తిరిగి వసూలు చేసుకోవడంలో విఫలమవుతున్న ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన చర్యలతో మరో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ సంవత్సరపు 'హాల్ ఆఫ్ షేమ్' జాబితాలో చోటు సంపాదించుకుంది. ప్రపంచ వినాశనానికి కారణమయ్యే భారీ బాంబులు, మారణాయుధాలను తయారు చేస్తున్న కంపెనీలకు ఎస్బీఐ రుణాలిస్తూ ఉండటమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా 158 బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ల పేర్లను ప్రకటిస్తూ, 'హాల్ ఆఫ్ షేమ్' జాబితాను డచ్ సంస్థ పీఏఎక్స్ ప్రచురించగా, ఇండియా నుంచి ఈ సిగ్గులేని జాబితాలో చోటును దక్కించుకున్న ఏకైక సంస్థ ఎస్బీఐ కావడం గమనార్హం. ఈ జాబితాలో జేపీ మోర్గాన్, బార్ల్కేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్రెడిట్ సూయిస్ తదితర సంస్థలూ ఉన్నాయి. మొత్తం 28 బిలియన్ డాలర్ల రుణాలను ప్రపంచ వినాశనానికి అవసరమయ్యే ఆయుధాలు తయారు చేస్తున్న ఏడు సంస్థలకు అందాయని పేర్కొంది. మొత్తం 275 పేజీలున్న ఈ నివేదికలో, ఎస్బీఐ స్థానిక చట్టాలు, నియంత్రణకు కట్టుబడి పనిచేస్తోందని, కమర్షియల్ గా ఆకర్షణీయంగా కనిపించే ప్రాజెక్టులకు రుణాలపై నిషేధం ఏమీ లేని కారణంగానే నష్టాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన 74 బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేర్లుండగా, చైనాకు చెందిన 29, దక్షిణ కొరియాకు చెందిన 26 సంస్థల పేర్లున్నాయి. అమెరికా కేంద్రంగా బాంబులు, రాకెట్ సిస్టమ్స్ తయారీ రంగంలో ఉన్న ఆర్బిటాల్ ఏటీకే సంస్థకు ఎస్బీఐ భారీ ఎత్తున రుణమిచ్చిందని పీఏఎక్స్ పేర్కొంది. ఈ కంపెనీలకు రుణాలివ్వడంపై నిషేధం ఉన్నప్పటికీ, బ్యాంకులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఇదే విషయమై ఎస్బీఐ ప్రతినిధి వివరణ కోరగా, ఆర్బిటాల్ ఏటీకేకు రుణం ఎస్బీఐ మాత్రమే ఇవ్వలేదని, అది ప్రపంచ బ్యాంకుల కన్సార్టియం రూపంలో ఇచ్చిందని తెలిపారు. వేల్స్ ఫార్గో, బీఓఏ మెర్రిల్ లించ్, సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ టోక్యో వంటి బ్యాంకులతో కలిసి తాము రుణమిచ్చామని వివరించారు.

  • Loading...

More Telugu News