: నేలపై కూర్చుని పైకి లేవలేక... ఒబామా నానా పాట్లు!
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలను మోస్తున్న బరాక్ ఒబామా వచ్చే నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించే నేతకు పగ్గాలు అప్పగించనున్నారు. ఇప్పటికి ఏడేళ్లకు పైగా దేశ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు మోసిన ఒబామా బరువైన కార్యాలనే చక్కబెట్టారన్న పేరుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకెళితే... శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలసి కాలిఫోర్నియాలోని యాష్మైట్ నేషనల్ పార్క్ లో ఆయన సరదాగా తిరిగారు. అక్కడి వాటర్ ఫాల్స్ ముందు ఫొటోలు తీసుకున్నారు. అక్కడికి వచ్చిన విద్యార్థులకు ‘పర్యావరణం’పై పాఠాలు కూడా చెప్పారు. ‘‘ఎలుగుబంటి వస్తే మీరేం చేస్తారు?... ఎలా భయపడతారు?’’ అంటూ సరదా ప్రశ్నలేశారు. నేలపై కూర్చుని పిల్లలతో కలిసి ఆయన ఫొటోలు దిగారు. ఆ తర్వాతే ఆయనకు అసలు సమస్య ఎదురైంది. కింద కూర్చున్న ఒబామా పైకి లేవలేకపోయారు. ‘హెల్ప్ మీ ప్లీజ్’ అంటూ పిల్లలను పిలుచుకుని వారి సాయంతో లేచి నిల్చున్నారు. ఈ ఆసక్తికరమైన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.